తహశీల్దార్ హెచ్చరిక బోర్డుతో ఆందోళనలో రైతులు

 జర్నలిస్ట్ చిర్రా  వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక మండలం: గోపాలరావుపేట గ్రామంలో 128వ సర్వే నంబర్ పరిధిలో 126.07 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ తహశీల్దార్ నరేష్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు రైతులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. గత ఆరు దశాబ్దాలుగా ఈ భూమిపై మూడు తరాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతులు తమ జీవనాధారాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ భూములకి  నీటి కోసం చెక్ డ్యాములు, బోర్లకు ట్రాన్స్‌ఫార్మర్లు,బాపనయ్యకుంట చెరువు ఆధారంగా సాగు సాగుతూ రెండు పంటల భూములుగా రైతులకు జీవనాధారాన్ని అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు నవోదయ స్కూల్ నిర్మాణం కోసం ఈ భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని రైతులు అభిప్రాయపడుతున్నారు. “స్కూల్ అవసరం సరే, కానీ జీవనాధారాన్ని లాక్కోవడం సబబేనా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.

రైతుల డిమాండ్లు:

  • పంట భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలి.
  • నవోదయ స్కూల్ నిర్మాణానికి ఖాళీ భూములను ఉపయోగించాలి.
  • భూమి ఎంపికలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

నవోదయ స్కూల్ అశ్వాపురంలోనే ఎందుకు?

గత  ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో అశ్వాపురం మండలంలో 30 ఎకరాల భూమిని నవోదయ స్కూల్ కోసం కేటాయించారు. స్కూల్ నిర్మాణానికి అవసరమైన బీటీ రోడ్డు కోసం రూ. 1.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఈ స్కూల్‌ను వేరే మండలానికి తరలించే యత్నాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. గతంలో పాలిటెక్నిక్ కళాశాలను అశ్వాపురం మండలానికి కేటాయించి, తరువాత కృష్ణసాగర్‌కు తరలించారు. ఇప్పుడు అదే విధంగా నవోదయ స్కూల్ కూడా తరలిస్తే మండల ప్రజల అభివృద్ధి ఆవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. నవోదయ స్కూల్ తరలింపును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గ్రామస్తుల విజ్ఞప్తి:గ్రామాభివృద్ధి కోసం నవోదయ స్కూల్‌ను ఖాళీ స్థలంలో నిర్మించాలి. పంట భూములను రక్షించడంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. రైతుల హక్కులను కాపాడడమే నిజమైన సమతుల అభివృద్ధికి దారితీస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. “రైతుల హక్కులకు తూట్లు పొడిచే అభివృద్ధి అవసరమా?” అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తులు, రైతులు కలిసి తమ సమస్యలను పరిష్కరించమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. “సమతుల నిర్ణయం తీసుకుంటేనే సక్రమ అభివృద్ధి సాధ్యం” అని వారు అభిప్రాయపడుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *