ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
పాల్వంచ, జూన్ 28 (journalist Chirra): జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం పాల్వంచ మండలం ఇందిరానగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ప్రయాణాల్లో ఉన్న కుటుంబాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులు, నిర్మాణ ప్రాంతాలు తదితర చోట్ల ఉన్న చిన్నారులకు కూడా ప్రత్యేకంగా పోలియో చుక్కలు వేయించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
