సేంద్రీయ వ్యవసాయానికి వెదురు కంచెల ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలు
భద్రాచలం/బూర్గంపాడు, నవంబర్ 15:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసి గిరిజన గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండలంలోని కందులపాడు గ్రామ నర్సరీని సందర్శించిన ఆయన, రైతులకు పొలాల చుట్టూ వెదురు మొక్కలతో కంచె ఏర్పాటుకు వెదురు మొక్కలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
రైతులకు అవగాహన కార్యక్రమాలు
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పండించేందుకు గిరిజన రైతులతో వ్యవసాయ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. మునగ చెట్లు వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహించి, ఆర్థికంగా బలోపేతం కావడానికి సాయం చేస్తామని ఆయన తెలిపారు.
నర్సరీ అభివృద్ధిపై దృష్టి
నర్సరీలో పది ఎకరాల విస్తీర్ణంలో వెదురు టేకుతో పాటు 16 రకాల అడవి మొక్కలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వీటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కువ శాతం వెదురు మొక్కలు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. నర్సరీలో రోజువారీ నీటి సరఫరా, కలుపు మొక్కలను తొలగించడం వంటి పనులను క్రమంగా నిర్వహించాలని బీట్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, నర్సరీ ఇంచార్జ్ బీబీ నాయక్, బీట్ ఆఫీసర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
– అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం
