భద్రాచలం: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో సర్వే ప్రక్రియ వేగవంతం
భద్రాచలం, నవంబర్ 15:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలను మిస్ కాకుండా సేకరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం భద్రాచలంలోని ఐటీడీఏ రోడ్డులో ఇంటింటి సర్వేను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివరాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఎన్మారేటర్లను అడిగి తెలుసుకున్నారు.
సర్వేలో 57 అంశాల సేకరణ
ఇంటింటికి స్టిక్కర్ వేసిన ఇండ్లలో కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలతో పాటు మొత్తం 57 అంశాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. నమోదు చేసిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి, ఎటువంటి పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో నిర్దిష్ట సమయంలో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి ఘాట్లలో భక్తుల భద్రతకు చర్యలు
కలెక్టర్ గోదావరి స్నాన ఘాట్లను సందర్శించి, భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు సురక్షితంగా గోదావరిలో స్నానం చేయడానికి, లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా ఘాట్ల చుట్టూ గొలుసులతో స్తంభాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ రింగులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
పర్యాటక అభివృద్ధికి చర్యలు
భద్రాచలం మరియు కిన్నెరసాని, తుమ్మల చెరువు, రేగళ్ల వంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంపై కలెక్టర్ దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం తక్కువ ఖర్చుతో విహార పడవలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
శిశు గృహ పరిశీలన
కలెక్టర్ శిశు గృహ కేంద్రాన్ని సందర్శించి, శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, దేవస్థానం ఈవో రమాదేవి, ఇరిగేషన్ ఏఈ వెంకటేష్, తహసీల్దార్ శ్రీనివాస్, మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
– అదనపు పౌర సంబంధాల అధికారి, భద్రాచలం
