మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యే అవకాశం

సినీ నటుడు మోహన్ బాబుపై జర్నలిస్టులపై హత్యాయత్నం కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జల్పల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై దాడి చేయడమే కాకుండా, తన కుమారుడు మంచు మనోజ్ దంపతులపై కూడా దాడికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.

జర్నలిస్టులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తల, చెవులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు, మోహన్ బాబు తన ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తీరు ఇతరుల ప్రాణాలకు ముప్పుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కుటుంబ కలహాలు తీవ్రమైన దాడులకు దారితీశాయి
తన కుమార్తెను చూసేందుకు వచ్చిన మంచు మనోజ్ దంపతులపై మోహన్ బాబు అండతో మంచు విష్ణు నియమించిన బౌన్సర్లు దాడి చేసినట్లు సమాచారం. మనోజ్ చొక్కా చింపేసి, బయటకు పంపించారని, ఆయన కుమార్తెను చూడనివ్వలేదని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గన్ లైసెన్స్ రద్దు
మోహన్ బాబు వద్ద గన్ ఉందని గుర్తించిన పోలీసులు, ఆయన గన్ లైసెన్స్‌ను రద్దు చేశారు. మంచు విష్ణు గన్ లైసెన్స్ కూడా రద్దు చేసి గన్ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

పోలీసులు మోహన్ బాబు చర్యలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యాయత్నం కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, కుటుంబ కలహాల మధ్య గొడవలు  పెద్ద కుంపటిగా మారకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ దాడులతో మంచు కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. మీడియాపైనా, కుటుంబ సభ్యులపైనా జరిగిన దాడులు ఎంతవరకు న్యాయస్ధానం ఎదుట నిలుస్తాయో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *