భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి

,భద్రాచలం నవంబర్23 భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, స్వామివారి క్షేత్ర విశిష్టతను వివరించారు. మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్పటికే రామాలయం మాడవీధుల అభివృద్ధికి రూ.70 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు ఎకరాల భూమి సాధన కోసం చర్యలు చేపట్టామని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులమని, రామాలయ అభివృద్ధిలో కలిసి ముందుంటామని మంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ అభివృద్ధికి పటిష్టంగా సహకరిస్తారని చెప్పారు. భద్రాచలం రామాలయంపై ఉన్న ప్రేమతోనే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి మరోసారి గుర్తు చేశారు. అనంతరం, మంత్రి ఆలయ అధికారులతో కలిసి మాడవీధుల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *