సింగరేణి మణుగూరు OC-2లో ప్రమాదం: డంపర్ ఆపరేటర్ మూల్ చంద్ మృతి

మణుగూరు, డిసెంబర్ 19: సింగరేణి మణుగూరు పీకే ఓసి-2లో ఈ రోజు ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహణలో ఉన్న డంపర్ ఆపరేటర్ మూల్ చంద్ (60) ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.100 టన్నుల కెపాసిటీ గల డంపర్‌తో మట్టి డంపింగ్ చేస్తూ, ఓబీ గుట్టపై నుంచి డంపర్ బోల్తా పడటంతో క్యాబిన్ నుంచి కింద పడిన మూల్ చంద్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.  మూల్ చంద్, కొత్తగూడెం నుండి మణుగూరుకు అప్ అండ్ డౌన్ చేస్తూ విధులను నిర్వహిస్తున్నారు. ఆయన కొత్తగూడెం జెకే నుండి డిప్యూటేషన్‌పై మణుగూరులో విధులు చేపట్టినప్పటికీ, మరి కొన్ని నెలల్లో పదవీ విరమణ పొందాల్సి ఉంది. అత్యంత క్రమశిక్షణతో, సేఫ్టీ నిబంధనలను పాటిస్తూ మంచి ఆపరేటర్‌గా పేరుతెచ్చుకున్న ఆయన అకాల మరణం సింగరేణి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కార్మిక సంఘాల స్పందన:

ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు రాంగోపాల్, టీబీజీకేఎస్ నుంచి వెంకట్, ఇతర కార్మిక సంఘ నాయకులు, సింగరేణి అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. “మూల్ చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని” ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు.కార్మిక సంఘాలు సింగరేణి అధికారులను మరింత సురక్షితమైన పద్ధతులను అమలు చేయాలని కోరాయి. “సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించడం, మరింత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు,” అని వారు అభిప్రాయపడ్డారు.సింగరేణి మణుగూరు OC-2లో సేవలందించిన ఓ కృషి శీలి ఆపరేటర్ మూల్ చంద్ అకాల మరణం అందరినీ శోకసాగరంలో ముంచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సింగరేణి కుటుంబం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *