ఆర్టీసీ రిమూవల్ కేసులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు: ఎస్‌డబ్ల్యూఎఫ్ హర్షం, స్పష్టతకు విజ్ఞప్తి
మణుగూరు: ఆర్టీసీలో వివిధ కారణాలతో సర్వీసు నుండి తొలగింపులకు గురైన ఉద్యోగుల కేసులను పరిశీలించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటియు అనుబంధం) స్వాగతించింది. అయితే, ఈ కమిటీకి సంబంధించిన జీవోపై మరింత స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు.
బుధవారం మణుగూరు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వి.ఎస్. రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “జీవో విడుదలైన తర్వాత ఆర్టీసీ లో మరెవరినీ తొలగించవద్దనే ఆదేశాలు ఇచ్చారా?” అనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. జీవో 938 ప్రకారం త్రిసభ్య కమిటీ:తొలగింపు కేసులపై వేగవంతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపులు ఇతర శాఖలతో పోలిస్తే విభిన్నంగా ఉన్నాయని, ఈ విషయంలో సమగ్రమైన పరిష్కారాన్ని కమిటీ అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహాలక్ష్మి పథకం: ఈ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయినప్పటికీ, టీమ్ మిషన్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు జరగలేదని, దీనివల్ల ఉద్యోగులకు వస్తున్న సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పీల్ పరిష్కార కాలపరిమితి: క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగుల అప్పీల్‌పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నా, వాటి పరిష్కారం ఎంత కాలంలో జరుగుతుందనే విషయంలో స్పష్టత ఇవ్వాలని త్రిసభ్య కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో రీజియల్ నాయకులు బాణాల రాంబాబు, గుండు మాధవరావు, కూరపాటి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. త్రిసభ్య కమిటీ న్యాయబద్ధంగా పనిచేసి, ఉద్యోగుల సమస్యలను సమర్థంగా పరిష్కరించాలనే ఆకాంక్షతో ఈ సమావేశం ముగిసింది.
