మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి TWJF ఖండన
జల్పల్లి లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అకారణంగా దాడి చేసిన ఘటనను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తీవ్రంగా ఖండించింది.మీడియా ప్రజలకూ, ప్రభుత్వాలకూ వారధిగా పనిచేస్తుంది. సమాజానికి వాస్తవాలను తెలియజేయడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తారు. అలాంటి పాత్రికేయులపై టీవీ9 మరియు టీవీ5 జర్నలిస్టులపై దాడి చేయడం మోహన్ బాబుకు సరికాని చర్య.ఈ నేపథ్యంలో TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడిసోమయ్య మరియు ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య మాట్లాడుతూ, “మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అసహనానికి ఉదాహరణ. ఈ ఘటనపై మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. అలాగే, మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతూ, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని TWJF విజ్ఞప్తి చేసింది. TWJF జాతీయ కౌన్సిల్ సభ్యుడు చిర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “మీడియా ప్రతినిధులు సమాజానికి వాస్తవాలను తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిపై దాడులు అరికట్టడం అత్యవసరం” అని అన్నారు.TWJF ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
చిర్ర శ్రీనివాస్ గౌడ్
సీనియర్ జర్నలిస్ట్
జాతీయ కౌన్సిల్ మెంబెర్
తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF)
