రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూలై 21 (జర్నలిస్ట్ చిర్రా) – ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వర్షాకాల పరిస్థితులు, వ్యవసాయ, వైద్య, నీటిపారుదల మరియు ఇతర అభివృద్ధి అంశాలపై సోమవారం ఆయన సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేకానంద, దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, వాకిటి శ్రీహరి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, చెరువుల నీటి నిల్వలు, వ్యవసాయ సాగు, యూరియా మరియు ఎరువుల అందుబాటుపై జిల్లాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎరువుల కొరతకు సంబంధించి కృత్రిమ సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణంలో స్టాక్ బోర్డులు ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యటించి అధికారుల పనితీరును సమీక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పిడుగుపాటులతో కలిగే నష్టాలను నమోదు చేసి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. పశువుల సంరక్షణకు వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 96.95 లక్షల రేషన్ కార్డుల ద్వారా సుమారు 3.10 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని, కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. అంతేకాక, వర్షాకాల వ్యాధుల నివారణ కోసం హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖను ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాల్లో సరైన నీటి పారుదల చేపట్టాలని, వరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లాలో వరద ముప్పు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, నీటి నిల్వలు, దోమల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఇంకుడు గుంతలు తవ్వించాలని సూచించారు. యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, వైద్యాధికారి జయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

–జర్నలిస్ట్ చిర్రా
www.journalistchirra.com

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *