పిల్లల సంరక్షణ మన అందరి భాద్యత: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU) సమావేశం
జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU) సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జిల్లాలోని కోళ్ల ఫామ్స్, ఇటుక బట్టీలు మరియు షాపింగ్ మాల్స్ వంటి అనేక చోట్ల తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మణుగూరులో ఉన్న బాలల సంరక్షణ గృహం జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో, అక్కడ పర్యవేక్షణ సౌకర్యం లేకపోవడం వల్ల, కొత్తగూడెంలో బాలల సంరక్షణ గృహం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ గృహాన్ని త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మణుగూరు బాలల సంరక్షణ గృహాన్ని సిడిపిఓ కార్యాలయంగా మార్చాలని కూడా చెప్పారు.
బాలల సంరక్షణ గృహాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్నా, వారు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని, వారానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలనూ ఆదేశించారు.
బాల్య వివాహాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థినిల హాజరును పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పది రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉన్న విద్యార్థినిలు ఆరోగ్య సమస్యలు లేదా వివాహం జరిగిందా అన్న అంశాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో, బాల్య శోషణ, పోక్సో కేసుల నమోదు, చైల్డ్ హెల్ప్ లైన్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
పోక్సో కేసుల నివేదిక:
జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదు అయ్యాయో, వివిధ స్థాయిలలో దయచేసి ఒక వారంలో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన సదస్సులు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చైల్డ్ హెల్ప్ లైన్:
చైల్డ్ హెల్ప్ లైన్ కి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిలలో నమోదు చేయాలని మరియు ప్రతి నెల మొదటి వారంలో పాఠశాలలు, హాస్టల్స్ హెడ్మాస్టర్లు మరియు వార్డెన్లతో మాట్లాడి, విద్యార్థుల హక్కులపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
