ములుగు కేంద్రంగా భూకంపం – తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు!
ములుగు జిల్లా కేంద్రంగా ఈరోజు ఉదయం 7:27 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. భూమికి 40 కిలోమీటర్ల లోతున ఉన్న ఈ భూకంపం ప్రభావం దాదాపు 225 కిలోమీటర్ల మేర విస్తరించిందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లాతో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భూమి కంపించగా, హైదరాబాద్‌లో వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ప్రకంపనలు గుర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల తదితర ప్రాంతాల్లో భూమి 3-4 సెకన్ల పాటు కంపించినట్టు ప్రజలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభావం: విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మణుగూరులో ఇదే ఏడాదిలో ఇది రెండోసారి భూకంపం కావడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లలోని సామాన్లు కదలడం, వణుకడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మణుగూరు నుంచి ఓసి 2 గణికి వెళ్లే రహదారి కొంతకోతకు గురవ్వగా, – భద్రాద్రి పవర్ ప్లాంట్‌లోని ఉద్యోగులు ఉలిక్కిపడగా, ఎలాంటి నష్టం లేదని అధికారులు ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వల్ప ప్రకంపనలపై భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7కి చేరితే గణనీయమైన నష్టం సంభవించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో తరచుగా సంభవిస్తున్న భూప్రకంపనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తుల కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని, భూకంపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. భూకంప ప్రభావం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఉపశమనకారకమైనప్పటికీ, తరచూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
