డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలి |జిల్లా కలెక్టర్ ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , డిసెంబర్ 4: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను మెరుగుపరచడం కోసం జిల్లాలోని తాసిల్దార్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో లబ్ధిదారుల జాబితాలను డిసెంబర్ 5 సాయంత్రం లోపు ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.ప్రదర్శించిన జాబితాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గ్రామసభలు గ్రామపంచాయతీ కార్యాలయాల పరిధిలో లేదా నిరుపేద అవసాల వద్ద నిర్వహించాలని, ఈ విషయాన్ని కూడా నోటీసు బోర్డులో వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే పూర్తి చేసిన మండలాలు, ఇంకా పూర్తికాని మండలాలకు సహాయం అందించాలని, ఈ క్రమంలో ప్రత్యేకంగా ములకలపల్లిలో డేటా ఎంట్రీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను నిర్దిష్ట ఫార్మాట్లో పూర్తి చేయాలని, దరఖాస్తులకు ఫోటోలు మరియు ప్రస్తుతం నివసిస్తున్న గృహాల చిత్రాలు తప్పనిసరిగా జోడించాలని సూచించారు. ఏ, బి, సి లబ్ధిదారుల జాబితాలను నిర్దేశిత గడువులోగా ప్రదర్శించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి సమస్యలు తలెత్తినా, వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ చర్యలు పథకం అమలులో పారదర్శకతను కల్పించడమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Chirra Journalist
